పెట్రోల్ పోయించుకునేందుకు బంక్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదరైంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో బంక్ లోపలికి వెళ్లి పరిస్థితిని చూసొచ్చేసరికి బయట పార్క్ చేసిన బైక్ మాయమైంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ కొరత కారణంగా పెట్రోల్ బంక్‌ల ముందు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీంతో పెట్రోల్ ఉన్న బంక్‌ల్లో వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే కురవికి చెందిన మీ సేవ కేంద్ర నిర్వాహకుడు అమర్నాథ్ పెట్రోల్ కోసం బైక్‌పై బంక్‌కు వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో బండిని బయటే పార్క్ చేసి, లోపల పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు వెళ్లాడు.
సుమారు 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్ కనబడలేదు. దీంతో ఆందోళనకు గురైన అమర్నాథ్ చుట్టుపక్కల వెతికి చూశాడు. కానీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.