బాసర, అక్టోబర్ 22: నిర్మల్ జిల్లా బాసర (Basara) పుణ్యక్షేత్రంలో ఆంధ్రా స్వాములోరి ‘బీజాక్షర’ వివాదం మళ్లీ మొదలైంది. ‘బాసరలో బీజాక్షరాలు రాయను’ అంటూ గతంలో ప్రకటించిన స్వామీజీ, ఇప్పుడు బాసరకు కూతవేటు దూరంలో గోదావరికి అవతలిపక్కనున్న నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ గ్రామంలో బీజాక్షర క్షేత్రాన్ని తిరిగి ప్రారంభించారు. దీనిపై ఆలయ అధికారులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాసరలో వేద పాఠశాల పెట్టేందుకని వచ్చిన ఓ ఆంధ్రా స్వాములోరు గతంలో వేద పాఠశాల ముసుగులో ‘బీజాక్షరం’ పద్దతి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలోనే వేద పాఠశాల విద్యార్థి ఒకరు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. కొండెంగ దాడిలో విద్యార్థి గాయపడినట్టు చెప్పినా.. ఎవరో దాడి చేసినట్టు ఉన్నదని బాధిత కుటుంబం ఆరోపించింది.
పాఠశాలలో ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ దొరకకపోవడం, సరిగ్గా అదే సమయానికి సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో విద్యార్థి గోదావరిలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో అనుమానాస్పదంగా చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో వేద పాఠశాల పేరుతో స్వామీజీ పాల్పడే ఆకృత్యాలపై ఈ ఏడాది జూలైలో ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో వేదపాఠశాలను మూసి వేయడంతోపాటు, ‘బాసరలో ఇకపై స్వామీజీ బీజాక్షరాలు రాయరు’ అంటూ వేద పాఠశాల కమిటీ ప్రకటించింది. దీంతో బాసరలో బీజాక్షర వివాదానికి తెరపడింది. బీజాక్షరం పూర్తిగా బంద్ కావడంతో ఆలయ అర్చకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్‌కు అక్కడి నుంచి యంచకు..
వేద పాఠశాల కమిటీ ప్రకటనతో స్వామీజీ రెండు నెలలకిందట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు మకాం మార్చారు. అక్కడ అనుకున్నంత స్థాయిలో బీజాక్షరం నడవకపోవడంతో స్వామీజీ బాసరకు కూతవేటు దూరంలో ఉన్న యంచలోని తన పాత శిబిరంలో బీజాక్షరం రాయడాన్ని పునఃప్రారంభించారు. కార్తీక మాసం నుంచి నాలుకపై బీజాక్షరాలు రాస్తామంటూ బాసరకు వచ్చే భక్తులను ఆకట్టుకునేలా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్వామీజీ కొందరు స్థానికుల మద్దతు కూడగట్టుకొని బీజాక్షర శిబిరం మొదలుపెట్టినట్టు తెలిసింది. యంచ గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. దీంతో బీజాక్షర క్షేత్రం నడుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు గ్రామస్తులు పోలీసులను కోరినట్టు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాసర ఆలయ అధికారులు, వైదిక సిబ్బంది ఈ నెల 14న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను కలిశారు.
శాస్ర్తానికి విరుద్ధంగా స్వామిజీ నాలుకపై బీజాక్షరాలు రాస్తున్నారని, సనాతనంగా వస్తున్న సంప్రదయానికి విరుద్ధంగా నాలుకపై బీజాక్షరాలు రాయకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్‌లోని ఆపార్ట్మెంట్తోపాటు బాసరకు రెండు కిలోమీటర్ల దూరంలోని యంచలో నాలుకపై బీజాక్షరం పేరుతో భక్తులను మోసం చేస్తున్నారన్న విషయాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీపీ నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. నవీపేట్ పోలీస్టేషన్ ఎస్సైకి ఫోన్ చేసి బీజాక్షర క్షేత్ర ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీజాక్షరం రాయడం శాస్త్రవిరుద్ధమని, బాసరలోగానీ, చుట్టు పక్కలగానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇబ్బంది కలగడంతోపాటు బాసర అమ్మవారి పుణ్యక్షేత్రం అభాసుపాలవుతుందని వాపోతున్నారు.