మణికొండ, ఫిబ్రవరి 22: బిగ్బాస్ ఫేం, యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రేమించి, మోసం చేసిన కేసులో అతడి సోదరుడు సంపత్ వినయ్పై బాధితురాలు నార్సింగి పోలీసులను ఆశ్రయించటంతో నాటకీయంగా షణ్ముఖ్ కూడా గంజాయితో దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నానికి చెందిన యువతిని సంపత్ వినయ్ ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకొని, తీరా వేరే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడని బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మణికొండ పరిధిలోని పుప్పాలగూడ ప్రైస్టేజ్ హైట్స్ అపార్ట్మెంట్లో షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ ఉంటున్నారని వెల్లడించింది. విచారణలో భాగంగా పోలీసులు సంపత్ కోసం వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయి తాగుతున్నట్టు గుర్తించారు. ఇంట్లో 16 గ్రాముల గంజాయి, పలు రకాల డ్రగ్స్ పట్టుకున్నారు. ఇరువురిని అరెస్టు చేశారు.