డ్రోన్ వ్యవసాయం
- సాగులో డ్రోన్ల వినియోగానికి ప్రోత్సాహం
- తొలివిడతలో కేవీకేలు, ప్రయోగ కేంద్రాలకు
- అనంతరం రైతులకు, ఎస్‌హెచ్‌జీలకు సబ్సిడీతో
- డ్రోన్ వినియోగంపై వ్యవసాయశాఖ శిక్షణ
- యూనివర్సిటీలో ప్రత్యేకంగా ‘డ్రోన్ అకాడమీ’
- 5 పంటలపై వర్సిటీ ప్రయోగం విజయవంతం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పంటలకు పురుగు మందు ల పిచికారీకి డ్రోన్లను ఉపయోగించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన డ్రోన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకొన్నది. రాష్ట్రంలోని అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు డ్రోన్లను అందించనున్నది. ఇక్కడ ప్రయోగాల అనంతరం రైతులకు, మహిళా సంఘాలకు, ఎఫ్‌పీవోలకు డ్రోన్లను ఇవ్వనున్నది. డ్రోన్ల వినియోగానికి డీజీసీఏ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో తొలిదశలో ఆసక్తి గల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)కు రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. డ్రోన్లు ఖరీదుతో కూడుకున్నవి.
సాధారణ డ్రోన్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు అవసరం. దీనికి అదనంగా పంటలో చీడ పీడల్ని గుర్తించేందుకు హైలెన్స్ కెమెరాల ఏర్పాటుకు మరో రూ.3 లక్షల నుంచి 5 లక్షలు అవసరం. అంటే ఒక డ్రోన్ కొనాలంటే కనీసం రూ.12 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక రైతు ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టి డ్రోన్ కొనుగోలు చేయడం కష్టం. అందుకని దీనిని సులువు చేసేందుకు రైతుగ్రూపులకు, మహిళా గ్రూపులకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ల కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది.
స్వయం ఉపాధి అందించే దిశగా..
రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావడంతో ట్రాక్ట ర్లు, హార్వెస్టర్లు, జేసీబీలు, కల్టివేటర్ల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తున్నది. దీనిని మరింత విస్తృ తం చేసేందుకు డ్రోన్ల వినియోగం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లో స్కూల్ డ్రాపౌట్లు, ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న యువతను గుర్తిస్తున్నారు. ఈ బాధ్యతను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. గుర్తించిన యువకులకు శిక్షణ ఇప్పించి.. డ్రోన్లను అందించనున్నారు. తద్వారా వారికి స్వయం ఉపాధి లభించేలా చర్యలు తీసుకొంటున్నారు. ఆసక్తిగల యువత, ఎఫ్‌పీవో, మహిళా సంఘాలతో డ్రోన్లతోపాటు ఇతర వ్యవసాయ యంత్రాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
యూనివర్సిటీలో డ్రోన్ అకాడమీ
డ్రోన్స్ వినియోగానికి డీజీసీఏ అనుమతితోపాటు శిక్షణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆసక్తిగల వారికి డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. డ్రోన్స్‌పై శిక్షణకు బేగంపేట విమానాశ్రయం, యూనివర్సిటీ గ్రౌండ్‌ను అనువైన ప్రాంతంగా డీజీసీఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో ప్రత్యేకంగా డ్రోన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి గల యువతకు శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఏవియేషన్ అకాడమీ ఇప్పటికే ఆరుగురికి మాస్టర్ ట్రైనింగ్‌ను పూర్తిచేసింది. ఇక డ్రోన్లను మిస్యూజ్ చేయకుండా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నది. అనుమతిచ్చిన ఆన్ని డ్రోన్లను ప్రత్యేక వ్యవస్థ ద్వారా లింక్చేస్తారు.
ప్రయోగం విజయవంతం
డ్రోన్ల ద్వారా వివిధ పంటలకు పురుగు మందు పిచికారీపై వ్యవసాయ వర్సిటీ ఇప్పటికే ప్రయోగాలు నిర్వహించింది. ఈ ప్రయోగాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చినట్టు వర్సిటీ పరిశోధన విభాగం డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. వరి, కంది, పత్తి, సోయాబీన్, వేరుశనగపై ఈ ప్రయోగాలను నిర్వహించినట్టు ఆయన వివరించారు. వర్సిటీలో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ఇతర ప్రయోగా కేంద్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
డ్రోన్లతో లాభాలు.. జాగ్రత్తలు
- డ్రోన్ల ద్వారా గంటకు రెండెకరాల చొప్పున రోజుకు (8 గంటలు) 16 ఎకరాలకు పురుగు మందు పిచికారీ చేయవచ్చు.
- సాధారణ విధానంతో పోల్చితే డ్రోన్ల ద్వారా తక్కువ పురుగు మందు అవసరం పడుతుంది. తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు.
- డ్రోన్లతో పిచికారీ చేస్తే పంట మొత్తానికి సరైన విధానంలో పురుగు మందు అందుతుంది.
- డ్రోన్ల ద్వారా కేవలం పురుగుల మందు పిచికారీ చేయడం మాత్రమే కాదు.. చీడపీడలను గుర్తించడం కూడా సాధ్యమవుతుంది.
- డ్రోన్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా చీడపీడలను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవచ్చు. తద్వారా పంట నష్టం కాకుండా జాగ్రత్త పడొచ్చు.
- పంట ఏ విధంగా ఉన్నది? ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది? వంటి అంశాలను కూడా అంచనా వేయవచ్చు.
- యువతకు, మహిళా సంఘాలకు, ఎఫ్‌పీవోలకు ఉపాధి లభిస్తుంది.
డ్రోన్ల వినియోగానికి అనుమతి తప్పనిసరి. - డ్రోన్ ఆపరేటింగ్‌కు ప్రత్యేక శిక్షణ తీసుకొని ఉండాలి.
- వర్షం, గాలి వీచే సమయంలో డ్రోన్ల ద్వారా పిచికారీ చేయవద్దు.
- ఆవాసాలకు, చెరువులు, కుంటలకు దూరంగా ఉన్న పంటలపైనే పిచికారి చేయాలి.
- వ్యవసాయం కోసం అనుమతి తీసుకొని గ్రామాల్లో, ఇతర కార్యక్రమాల్లో ఆ డ్రోన్లను ఉపయోగించకూడదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

