హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పేద రైతులకు పంపిణీ చేసిన లావణి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో కొట్టేసేందుకు వేసిన చీకటి ఎత్తును వెలుగులోకి తెస్తూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నగరానికి ఉత్తరాన ఫోర్త్‌సిటీ పేరుతో బేగరి కంచె చుట్టూ వేల ఎకరాల అసైన్డ్ భూములు, సీలింగ్ భూములను చెరపట్టిన ‘బిగ్ బ్రదర్స్’, తాజాగా రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 290 ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసిందుకు చేసిన ప్రయాత్నాన్ని గత నెల 31న నమస్తే తెలంగాణ దిన ప్రతిక బట్టబయలు చేసింది. ‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్’ అనే పతాక శీర్షికతో అచ్చయిన ఈ ఎక్స్‌ప్లోజివ్ స్టోరీ దీపావళి సందర్భంగా ఆటంబాంబులా పేలింది. ఈ కథనం క్లిప్పింగులకు ‘బిగ్ బ్రదర్ కుటుంబ అనివీతి’ అనే క్యాప్షన్ జత చేసి కాంగ్రెస్ వర్గాలే సోషల్ మీడియా గ్రూప్‌ల్లో వైరల్ చేశాయి. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది మంత్రుల అనుచరులు, దిగువ శ్రేణి నాయకులు తమ వాట్సాప్ స్టేటస్‌గా ఈ కథనాలను పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంత పార్టీ కార్యకర్తల వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ చేశారు. రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల కీలక నేతలు కొందరు ఎవరికి వారిగా ఈ కుటుంబ అనినీతి కథనాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు.