Bhoodan Lands | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారం గ్రామంలోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవని పేర్కొంది. భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రజా ఆస్తి పరిరక్షణ చర్యల్లో భాగంగా వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని జిల్లా కలెక్టర్, మహేశ్వరం, ఎల్బీనగర్ సబ్రిజిస్ట్రార్లలకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వీలుగా ఏ ఒక లావాదేవీని జరపడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
ఈ భూబాగోతంలో ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించరాదని రిజీస్ట్రీని ఆదేశించింది. కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారులపైనే తీవ్ర అభియోగాలు ఉన్నందున ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి ఆసారం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆ అధికారులకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీచేస్తున్నట్టు ప్రకటించింది. భూదాన్, గ్రామదాన చట్టం ప్రకారం దాతలు ఇచ్చిన భూదాన్ భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల నిర్మాణాలకు కేటాయించాల్సి ఉందని గుర్తుచేసింది. ఈ భూములు వారసత్వంగా కొనసాగించవచ్చని పేర్కొంది. అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి గురువారం కీలక ఉత్తర్వులు జారీచేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గత ఫిబ్రవరి, మార్చిల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ స్థానికుడు బిడ్డ మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నందున సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భూదాన్ చట్టం, తెలంగాణ భూదాన్, గ్రామదాన నిబంధనలు-1965కు విరుద్ధంగా సొంత పేర్లతోపాటు కుటుంబసభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, ఈ ఏడాది మార్చి 8న సీఎంవో కార్యాలయంతోపాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రాలు పంపినప్పటికీ చర్యలు శూన్యమని తెలిపారు.
ఏపీ, తెలంగాణల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నందున కేంద్రానికి చెందిన డీవోపీటీ, హోంశాఖలకు జనవరి 13న ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తెలిపారు. బినామీ లావాదేవీలు నిర్వహించడంతో చట్టవిరుద్ధంగా భూదాన్ భూములను అక్రమంగా బదలాయింపులు చేశారని ఆరోపించారు. భూదాన్ భూముల బదలాయింపు, అన్యాక్రాంతంపై నిషేధం ఉన్నప్పటికీ అధికారులు రికార్డులను తారుమారు చేశారని అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్పించుకుని పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా పొందారని తెలిపారు. అక్రమాలను బయటపెట్టిన పిటిషనర్లకు హాని తలపెట్టే అవకాశం ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరారు.
ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీసీఎల్ఏతోపాటు సీబీఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాళ్ల కుటుంబసభ్యులకు, ఇతర అధికారులకు కూడా నోటీసులు జారీచేసింది.
ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు నవీన్ మిట్టల్, జ్ఞానముద్ర (సోమేశ్‌కుమార్ భార్య), పావనీరావు (రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు భార్య), ఐశ్వర్యరాజు (ఈ వికాస్‌రాజు భార్య), వసుంధర సిన్హా, ఏకే మొహంతి, ఓం అనిరుధ్ (ఐపీఎస్ అధికారి రాచకొండ కమిషనర్ కొడుకు), నందిన్మాన్ (ఐపీఎస్ విక్రమ్‌సింగ్‌మాన్ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్ సందీన్సుల్తానియా భార్య), రాధిక (ఐపీఎస్ కమలాసన్‌రెడ్డి భార్య), నితేశ్‌రెడ్డి (మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కొడుకు), ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్‌జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, రేఖా షరాఫ్ (ఐపీఎస్ ఉమేశ్‌షరాఫ్ భార్య), రేణుగోయల్ (డీజీపీ జితేందర్ భార్య), దివ్యశ్రీ (ఐఏఎస్ ఆంజనేయులు భార్య), హేమలత (ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి భార్య), ఇందూరావు కే (ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్య), సవ్యసాచి ప్రతాప్‌సింగ్ (ఐపీఎస్ గోవింద్‌సింగ్ కొడుకు), రాహుల్ (రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి కొడుకు), వరుణ్ (ఐపీఎస్ విశ్వప్రసాద్ కొడుకు), రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ, ఐఏఎస్‌లు అమోయ్‌కుమార్, రాజశ్రీ హర్ష, అజయ్‌జైన్, ఇతర అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను వారందరికీ అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు.
వాదనల తర్వాత హైకోర్టు.. నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి ప్రయోజనాల రక్షణల్లో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉంటుందని సందేహం వ్యక్తంచేసింది. కాబట్టి తమకున్న విచక్షణాధికారాలను వినియోగించి ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సర్వే నం. 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిలా కలెక్టర్, సబ్రిజిస్ట్రార్లకు ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు ప్రకటించింది. తిరిగి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ భూముల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని షరతు విధించింది.
భూదాతల అభీష్టానికి అనుగుణంగా అవి వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే వినియోగించేందుకు పేదలకు కేటాయించవచ్చని పేర్కొంది. లేనిపక్షంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు ప్రజాఅవసరాలకు, బలహీనవర్గాల ఇండ్ల నిర్మాణానికి వాడుకోవచ్చునని తెలిపింది. భూదాన్ నిబంధన 3 ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వవచ్చనని కూడా పేర్కొంది. అంతేగాని అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూన్ ఒకటికి వాయిదా వేసింది.