భూపాలపల్లి: భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యపై పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. తన భర్తను రేణుకుంట్ల సంజీవ్, పింగలి శ్రీమంత్, కొత్తూరి కుమార్‌తోపాటు మరొకరిపై రాజలింగమూర్తి సతీమణి సరళ భూపాలపల్లి (Bhupalpally) పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి విషయమై రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో గతకొంతకాలంగా వివాదం నెలకొన్నదని, ఈ నేపథ్యంలో తన భర్తను ఈ నలుగురు కలిసి ఈ నెల 19న దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వారిని ప్రోత్సహించిన వారి గుర్తించాలని, ఈ ఘటనలో రాజకీయనాయకుల ప్రమేయం ఉన్నదని అనుమానం ఉందని, సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు బీఎన్ఎస్ యాక్ట్‌లోని 191 (2), 191 (3), 61 (2), 126 (2), 103 (2), రెడ్‌విత్ 190 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. దానికి 117/2025 నంబర్‌ను కేటాయించారు.
అసలేం జరిగిందంటే..
భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి (48) బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం మీదుగా రెడ్డికాలనీ వైపు వెళ్తున్నారు. అక్కడ కాపుగాసిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు.
స్థానికులు చేరుకునేలోగా దుండగులు పారిపోయారు. రాజలింగమూర్తిని జిల్లా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువులు దవాఖానకు చేరుకొని ఆందోళనకు దిగారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ నరేశ్ పరిస్థితిని పర్యవేక్షించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దవాఖానకు చేరుకొని మృతుడి బంధువులను పరామర్శించారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హత్యపై అనుమానాలెన్నో..
రాజలింగమూర్తి హత్య ఘటన పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్‌తోపాటు వీఆర్వోను ఏసీబీకి పట్టించాడు. అప్పటి నుంచి అతడిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందున్న రేణిగుంట్ల కుటుంబానికి సంబంధించిన భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని ఆ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. 171 సర్వేనంబర్‌లోని అటవీ శాఖ భూమిలో సైతం రాజలింగమూర్తి తలదూర్చడంపై పలువురు గుర్రుగా ఉన్నారు. రాజలింగమూర్తి గతంలో మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్యకు వ్యతిరేకంగా కేసు వేయడంతోపాటు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుపై కూడా కేసులు వేశాడు.