హైదరాబాద్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. వీటి నిర్మాణానికి ఎంఈఐఎల్ రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నది. స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను వచ్చే ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవానికి పూర్తి చేస్తామని మేఘా డైరెక్టర్ రవి పీ రెడ్డి తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, లైబ్రరీ, ఆడిటోరియం, క్లాస్ రూములు, ప్రయోగశాలలను నిర్మిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మేఘా వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, ప్రాజెక్టు మేనేజర్ మదన్ కుమార్, వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.