హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): బీసీ, ఎంబీసీ, సంచార, అర్థ సంచార, సామాజికవర్గాల్లో ఆత్మగౌరవాన్ని నింపింది ముఖ్యమంత్రి కేసీఆరేనని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కొనియాడారు. ఉప్పల్ భగాయత్‌లో వడ్డెర, సంచార కులాల ఆత్మగౌరవ భవానాల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వకుళాభరణం మాట్లాడుతూ.. వేల కోట్ల విలువ చేసే స్థలాలను బలహీనవర్గాల ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వివరించారు.
నైతికత, నిబద్ధత, నిజాయితీ, ఐక్యతకు ఆలంబనగా నిలిస్తేనే బలహీనవర్గాలకు గౌరవం లభిస్తుందని, కుల సంఘాల్లో ఐక్యతను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నవారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమూల్యమైనదని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, కే కిశోర్‌గౌడ్, బీసీ సంక్షేమ అధికారులు అలోక్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, వడ్డెర, సంచార కులాల ప్రతినిధులు ఆలకుంట హరి, ఎత్తరి అంతయ్య, ట్రస్ట్ చైర్మన్ జరిపాటి సత్యనారాయణరాజు, వెంకటస్వామి, మొగిలి వెంకటస్వామి, మురారి, డాక్టర్ కృష్ణయ్య, ఒంటెద్దుల నరేందర్, నాగరాజు, వెంకట నారాయణ, భూపతిసాగర్, పాండు వంశరాజ్, మల్లేశం వంశరాజ్, బెకం వెంకట్, నరహరి, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.