ఖిలావరంగల్, జనవరి 14 : చరిత్ర కోట గోడల మధ్య సంక్రాంతి(Sankranthi) సంబురం మొదలైంది. మంచు కురుస్తున్న వేళ, ఓరుగల్లు(Warangal) లోగిళ్లు భోగి మంటల సెగలతో వేడెక్కాయి. కేవలం పాత వస్తువుల దహనమే కాకుండా, మనసులోని మాలిన్యాలను వదిలించుకోవాలనే సందేశంతో నగరవాసులు భోగి పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
వరంగల్లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే మహిళలు తమ ఇంటి ముందు కళ్లాపి చల్లి, అతి పెద్ద ముగ్గులను తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఖిలా వరంగల్, శివనగర్, చింతల్, పుప్పాలగుట్ట, ఆదర్శనగర్, దూపకుంట, బొల్లికుంట, గాడిపల్లి గ్రామాలతో పాటు నగరంలోని పాతబస్తీలలో గొబ్బెమ్మల సందడి ప్రత్యేకంగా కనిపించింది. పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మల మీద నవధాన్యాలు చల్లి ప్రకృతిని పూజించడం విశేషం.
సాంప్రదాయానికి ఆధునిక తోడు
నగరంలోని అపార్ట్మెంట్ కల్చర్లోనూ సంప్రదాయం వెల్లివిరిసింది. అపార్ట్మెంట్ వాసులంతా సామూహికంగా భోగి మంటలు వేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాత కాలపు ఆచారాలను నేటి తరానికి పరిచయం చేస్తూ, హరిదాసుల కీర్తనల మధ్య గడిపిన క్షణాలు అలరించాయి. ప్లాస్టిక్, టైర్ల వంటి హానికర వస్తువులను మంటల్లో వేయకుండా, కేవలం పిడకలు, చెక్క ముక్కలతో ‘పర్యావరణ హిత భోగి’ని జరుపుకోవడం విశేషం. కులమతాలకు అతీతంగా బస్తీల్లో అందరూ కలిసి భోగి మంటల దగ్గర ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు. రేపు (గురువారం ) జరగనున్న మకర సంక్రాంతి (పెద్ద పండుగ) కోసం వరంగల్ నగర మార్కెట్లు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. అలాగే పిండి వంటల వాసనలతో ఓరుగల్లు వీధులు ఘుమఘుమలాడుతున్నాయి.