యాదగిరిగుట్ట, జనవరి 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ జాతీయ సర్టిఫికెట్ భోగ్ (భగవంతునికి ఆనందకరమైన, పరిశుభ్రమైన ప్రసాదం సమర్పణ) వరించింది. ఆ సర్టిఫికెట్ను శనివారం యాదగిరిగుట్ట దేవాలయంలో ఆలయ అధికారులకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ సీఈవో కమలవర్ధన్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 70కిపైగా దేవాలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి ప్రముఖ దేవాలయాలకు మాత్రమే ఇప్పటివరకు ఈ గుర్తింపు రాగా, తెలంగాణలో రెండు దేవాలయాలకు రావడం విశేషంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్గల్ దేవాలయం, యాదగిరిగుట్ట దేవస్థానానికి తొలిసారిగా ఈ గుర్తింపు లభించిందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం యాదగిరిగుట్ట, వర్గల్ దేవాలయాలను సందర్శించిందని చెప్పారు.
నైవేద్యం, అన్న ప్రసాదాల నాణ్యత, కిచెన్ నిర్వహణ, ఆహారం తయారీ విధానం, పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలపై పరిశీలన చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం ‘భోగ్’ గుర్తింపునకు రిఫర్ చేసిందని తెలిపారు. భోగ్ సర్టిఫికెట్ సాధించేందుకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఎంతో కృషి చేసిందని చెప్పారు.