హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు. ‘భగవంతుడు మీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. సమాజహితం కోసం మీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా మీ జీవితం కీర్తిమయం, సార్థకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమైనవి. ప్రజా సేవకు అంకితమై ముందుకు సాగుతున్న మీ జీవితంలో సుఖశాంతులు నిండాలని కోరుకుంటూ, మరోసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి లెటర్ హెడ్‌పై సంస్కృతంలో శ్లోకం రూపంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రార్థయామహే భవ శతాయుషీ
ఈశ్వరః సదా త్వాం చ రక్షతు
పుణ్య కర్మణా కీర్తిర్ణయ
జీవనం తవ భవతు సార్థకం