వనస్థలిపురం, ఫిబ్రవరి 7: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఓ వాహనం స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బుధవారం వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు విద్యార్థులతో వెళ్తున్న మన్సూరాబాద్‌లోని జాన్సన్ స్కూల్‌కు చెందిన ఓమ్ని వ్యాన్‌ను ఖమ్మం నుంచి నగరానికి వస్తున్న భట్టి కాన్వాయ్‌లోని టీఎస్ 09 పీఏ 3184 నంబరుగల ఓ పోలీస్ వాహనం ఢీకొన్నది. దీంతో స్కూల్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. వెంటనే స్థానికులు వచ్చి చిన్నారులను క్షేమంగా బయటకు లాగారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు రాత్రి వరకు ఫిర్యాదు అందలేదు.