కొత్తగూడెం సింగరేణి, జనవరి 22 : లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థను భ్రష్టు పట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో లాభాలు గడిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.80,450 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. సంస్థ నుంచి బొగ్గు తీసుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలు బొగ్గుకు సంబంధించిన బకాయిలు చెల్లించడంలేదని ఆరోపించారు. కమీషన్ల కోసం కొత్త విధానాలు ప్రవేశపెడుతూ సంస్థను దివాలా తీయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.