హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్‌లపై ఆయన సమీక్షించారు. 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 500 మెగావాట్ల పవన విద్యుత్తు, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టం పనుల తీరును సమీక్షించారు.
సింగరేణి సంస్థ ద్వారా 7 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అన్ని శాఖల నుంచి అనుమతులిప్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, టీజీ రెడ్కో సీఎండీ అనిల తదితరులు హజరయ్యారు.
సింగరేణి ప్రమాదబీమా పథకం దేశానికే ఆదర్శమని భట్టి విక్రమార్క తెలిపారు. రామగుండం-1 ఏరియాకు చెందిన పీ రంజిత్‌కుమార్ సింగరేణిలో సపోర్టుమెన్‌గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోగా, ఆయన భార్య లతకు రూ.1.2 కోట్ల విలువైన చెక్కును ఆయన అందజేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబం వీధినపడకుండా ఆర్థికభరోసా కల్పించడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి త్వరలోనే కారుణ్య నియామక పత్రం అందజేస్తామని తెలిపారు.