హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని ఆదివారం పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అధికారులు ఆయనను సీబీఐ జడ్జి ఎదుట హాజరుపరచగా, భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివేకా హత్య కేసులో కుట్రదారుడిగా భాస్కర్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. వివేకా గుండెపోటుతో మరణించినట్టు తొలుత ప్రచారం చేయడంలో, సాక్ష్యాలు చెరిపేయడంలో ఆయన పాత్ర ఉన్నట్టు తెలిపింది. హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని సీబీఐ వివరించింది.