ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. తగిన ఆధారాలతో లీగల్ టీమ్ రంగప్రవేశం చేసిం ది. భరోసా కేంద్రంలోని కోఆర్డినేటర్స్, కౌన్సిలర్స్ సాక్ష్యం చెప్పేందుకు పాపను అన్ని రకాలుగా సిద్ధం చేశారు. పోక్సో కేసులు విచారించే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వాద,ప్రతివాదనలు విన్నది. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉండటంతో కేవలం ఆరు నెలల్లోనే నిందితుడికి 20 ఏండ్లు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది.
2022 ఖలందర్నగర్లోనూ ఏడేండ్ల పాపపై పక్కింటి యువకుడు (27) అత్యాచారానికి ఒడిగట్టాడు. కేసు సంచలనం సృష్టించటంతో భరోసా బృందం రంగంలోకి దిగింది. పోలీసులు అదే రోజు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్, వైద్యబృందాలు ఇచ్చిన పక్కా ఆధారాలతో.. భరోసా లీగల్ టీమ్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు వినిపించింది. 10 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత న్యాయమూర్తి తుదితీర్పు వెలువరించారు. పదినెలల్లోనే ఆ మృగాడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా రెండూ విధించారు. ఈ తీర్పు మంగళవారం వెలువడింది.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అత్యాచార కేసుల్లో బాధితులకు సత్వ ర న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పకడ్బందీగా, పక్కాగా ఆధారాలు సేకరించి, బాధితులకు మనోధైర్యాన్ని అందించి, మృగాళ్లకు శిక్ష పడేలా కృషి చేస్తున్నాయి. 2020 జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుమారు 351 కేసుల్లో శిక్ష పడిన రేటు 51% ఉన్నది. ఈ సంచలన కేసుల్లో సుమారు 54 కేసులు ట్రయల్స్‌లో ఉన్నాయి. సాక్ష్యాధారాలను పరిశీలించి న్యాయమూర్తులు సుమారు 20 ఏండ్ల నుంచి సహజమరణం సిద్ధించే వరకూ జైలులోనే మగ్గేలా శిక్షలు విధిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’ కేసులు ప్రతినెలా సుమారు 180 కేసుల వరకు నమోదవుతున్నాయి. ఇందులో ప్రేమ పేరుతో జరిగే లైంగిక దాడులే దాదాపు 90% ఉన్నాయి. పిల్లలతో చేసే ప్రతి లైంగిక చర్య కూడా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కిందే పరిగణించబడుతున్నది. భరోసా సెంటర్ మెట్లు ఎక్కిన కేసులు, కేసు తీవ్రతను బట్టి ప్రత్యేకంగా డీల్ చేసే కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షలు పడే దిశగా కృషి చేస్తున్నారు.
సంచలనం సృష్టించిన కేసులను త్వరతిగతిన విచారించి నిందితుడికి శిక్ష, బాధితురాలికి న్యాయం అందించేందుకు భరోసా సి బ్బంది ‘29 కాలమ్ ప్రొసీజర్’ను రూపొందించింది. ఎఫ్ఐఆర్ అయింది మొదలు నిందితుడికి శిక్ష పడే వరకూ ఒక్కో ప్రొసీజర్ పూర్తి చేస్తూ ముందుకెళ్లాలి. అనుక్షణం హైదరాబాద్ నుంచి మానిటర్ చేస్తూనే ఉంటారు. భరోసా కేస్ టేకప్ చేస్తే.. కచ్చితంగా 45 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయాల్సిందే. కేసులను ఫాలోఅప్ చేసేందుకు ప్రతీనెలా ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీసర్లు, పీపీలు, డాక్టర్లు, లీగల్ సిబ్బంది, కోఆర్డినేషన్ సిబ్బందితో జూమ్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు.
అత్యాచార బాధితులకు 12 భరోసా కేంద్రాలు 24 గంట లూ పని చేస్తున్నా యి. నేరస్థులకు శిక్షపడేలా అన్ని చర్యలూ తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 34 పోక్సో కోర్టులు, 3 చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు ప్రత్యేకంగా పిల్లల కేసులను వాదిస్తున్నాయి. బాధితులకు ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. అధైర్య పడకండి. క్షణకావేశానికి గురై నిండు జీవితాన్ని జైలు పాలు చేసుకోవద్దు.