Bharat Serums | రాష్ట్రంలో రూ.100కోట్ల నుంచి రూ.200కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ కంపెనీ ( Bharat Serums and Vaccines Limited) ప్రకటించింది. గైనకాలజీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, యూరాలజీ విభాగాల్లో కంపెనీ సేవలందిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంజెక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. జీనోమ్ వ్యాలీ (Genome Valley)లో దాదాపు పది ఎకరాల స్థాలాన్ని స్వాధీనం చేసుకున్నామని, కొద్ది రోజుల్లోనే పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
సాధారణంగా ఇంజక్షన్ పాంట్ల్కు దాదాపు రెండు సంవత్సరాలు పడుతుందని ఎండీ సంజీవ్ నవాంగుల్ పేర్కొన్నారు. కంపెనీకి ఉత్తరాదిన మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఫెసిలిటీ ఉండగా.. ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా హైదరాబాద్‌లో ఫెసిలిటీని సర్వీస్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభం నుంచి కంపెనీ మోనోపాజ్ తర్వాత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించే ప్రత్యేక ఔషధాలను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సెగ్మెంట్ మొత్తం ఫార్మా పరిశ్రమలో 20 శాతం ఉందని, ఉత్పత్తులు మార్కెట్లో చొచ్చుకుపోతున్నాయని చెప్పారు. అలాగే ఇందులో యాంటీ బాడీ ప్లాట్‌ఫారమ్ సైతం ఉందని, పాము, తేలు కాటుకు, అప్లాస్టిక్ అనీమియాకు ఉత్పత్తులను సైతం తయారు చేయనున్నట్లు చెప్పారు. భారత్‌లోని టాప్ 30 కంపెనీల్లో భారత్ సీరమ్ సైతం ఉందని, అనేక విదేశీ మార్కెట్లలోనూ రాణిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రమని, పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్రం క్లస్టర్ విధానాన్ని అనుసరిస్తుందని, బయోటెక్ యూనిట్‌కు అవసరమైన బహుళ క్లియరెన్స్‌లు ఒకే విండో ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా.. జీనోమ్ వ్యాలీలో ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించింది.