పాములపర్తి వేంకట నరసింహారావు.. అనంత ఆకాశాన్ని అరచేతి అద్దంలో చూపించే ప్రయత్నం చేస్తే.. రెండక్షరాల పీవీ! రాజకీయాల్లో నారసింహం! సాహిత్యంలో సహస్రఫణి! వ్యూహరచనలో మేరునగం! స్థితప్రజ్ఞతలో హిమాలయం! తెలంగాణ నేల జగతికిచ్చిన కోహినూర్ వజ్రం.. మేలైన భారతరత్నం తరగని విజ్ఞాన ఖని.. తరతరాల జ్ఞానభూమి.. పీవీ!
తెలంగాణ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, వ్యూహరచనా దురంధరుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, తాత్విక యోగి, దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయనతోపాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌కూ కేంద్రం అత్యున్నత పురస్కారం ప్రకటించింది.

దేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన నేత, అసాధారణ ప్రజ్ఞాశీలి పీవీ. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన తెలుగుమేధ పీవీ. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు.. అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం దాకా.. దేశ తలరాతను తిరగరాశారు పీవీ. అప్పుల ఊబిలో కూరుకుపోయి బంగారం తాకట్టుపెట్టే దశ నుంచి తప్పించి, లైసెన్స్‌రాజ్ సంకెళ్ల నుంచి విముక్తం చేసి.. భారత గతిని, దుర్గతిని మార్చిన దార్శనికుడు. సంస్కరణలతో స్వేచ్ఛావాణిజ్యానికి ద్వారాలు తెరిచి, సంక్షోభాలను సైలెంట్‌గా పరిష్కరించారు. దేశాన్ని ప్రబల ఆర్థికశక్తిగా నిలిపారు. అసలు సిసలైన మేలిమి భారతరత్నం.. పీవీ! శతజయంతి ఉత్సవాలు ఇటీవలే పూర్తయిన వేళ.. మహానేత పీవీని వరించి తనను తానే గౌరవించుకున్నది భారతరత్న పురస్కారం! ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే!.. అందుకే మాతృభూమి తెలంగాణ సంతోషంతో మురిసిపోతున్నది. స్వస్థలం వంగర సగర్వంతో సంబురపడుతున్నది.

మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుజీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా ఆయన భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృత సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాల పాటు పార్లమెంట్, శాసనసభ్యుడిగా చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటంలో పీవీజీ దూరదృష్టితో కూడిన నాయకత్వం కీలక పాత్ర పోషించింది. దేశ శ్రేయస్సు, అభివృద్ధికి అది బలమైన పునాది వేసింది. భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేస్తూ ఆర్థికాభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహించిన ప్రధానిగా రావుగారి పదవీకాలం గుర్తుండిపోతుంది. అత్యంత క్లిష్టమైన మార్పుల నేపథ్యంలో భారతదేశ విదేశాంగ విధానం, భాష, విద్యారంగాలకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన అసలైన నాయకుడు పీవీ నరసింహారావు.
– ఎక్స్ వేదికగా సందేశంలో ప్రధాని మోదీ