హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): ప్రముఖ శాస్త్రవేత్త, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కోఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణా ఎం ఎల్లాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ(ఐఎన్ఎస్ఏ) ప్రతిష్టాత్మక ఇండియా ఫెలోషిప్తో సత్కరించింది. ఆవిష్కరణలు, కొత్త వ్యాక్సిన్ టెక్నాలజీల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది.
ఇటీవల చెన్నైలో జరిగిన ఐఎన్ఎస్ఏ 90వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణా ఎల్లాకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కృష్ణా ఎల్లా, భారత్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ డాక్టర్ అనిల్ కాకోద్కర్, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సారస్వత్, ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఎస్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితర విశిష్ట శాస్త్రవేత్తల జాబితాలో చేరారు.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ నూతన వ్యాక్సిన్లను కనుగొనడంలో భారత్‌ను ఆధిపత్య శక్తిగా మార్చేందుకు తన కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. తనకు ప్రేరణగా నిలిచిన భారత్ బయోటెక్ బృందంతో ఈ గౌరవాన్ని పంచుకుంటున్నట్టు తెలిపారు. కాగా, వ్యాక్సిన్ల ఆవిష్కరణ, తయారీ, పంపిణీలో దశాబ్దాల అనుభవం ఉన్న భారత్ బయోటెక్.. 125 దేశాలకు 9 బిలియన్లకన్నా అధిక మోతాదులో వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ 18 వ్యాక్సిన్లను తయారు చేస్తున్నది.