Agriculture | మంచిర్యాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి ; మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన రైతు తేజు నాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది నీటికి లోటు వచ్చింది. ఈయన పొలానికి కొద్ది దూరంలో గుట్టల వెనుకున్న గోదావరి కొన్నేండ్లుగా నిండుకుండలా ప్రవహిస్తున్నది. కానీ ఈ ఏడాది కాళేశ్వరం జలాలు ఎత్తిపోసే అవకాశం లేకపోవడం, పైన ఉన్న కడెం ప్రాజెక్టు నుంచి నీరు రాకపోవడంతో గోదావరిలో నీటి శాతం తగ్గింది. దీంతో మండే వేసవిలోనూ నిండుగా ఉండే తేజునాయక్ బావి ఎండిపోయింది. నాలుగేండ్ల క్రితం బావి తవ్విస్తే బండరాయి పడిందని వదిలేశారు. అప్పటి నుంచి ఆ బొంద అలాగే ఉంటూ వస్తుంది.
కానీ గడిచిన నాలుగేండ్లలో అది ఎప్పుడూ ఎండిపోలేదు. ఈ సారి మాత్రం పక్కనున్న గోదావరిలో నీరు లేక బావి బొంద అడుగంటింది. దీంతో నాలుగెకరాల్లో వేసిన వరిని కాపాడుకునేందుకు తేజు నాయక్ భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. బండరాయి ఉందని తెలిసినా బావిని జేసీబీతో తవ్విస్తున్నాడు. కొద్దిగా తవ్వగా వచ్చిన మురుగు నీటినే వరికి వదులుతున్నాడు. ఇందుకోసం పొలం దగ్గరే ఎవరో ఒకరు నిత్యం కాపాలా ఉండాల్సి వస్తున్నదని, ఇలా దినదిన గండంగా సాగు చేస్తున్నామని ఆయన వాపోతున్నాడు. ఒక్క రోజు నీరు లేకున్నా చేతికి వచ్చే దశలో ఉన్న పంట నాశనమైపోతుందని తేజునాయక్ బాధపడుతున్నాడు.