హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి డిమాండ్ వస్తున్నది. ఇప్పటికే లక్షకు పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకొన్నారు. మొదటి విడతలో 50 వేల మందికి ఆర్టీసీ తలంబ్రాలను హోండెలివరీ చేస్తున్నది. ఆదివారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించింది. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల దృష్ట్యా తలంబ్రాల బుకింగ్స్‌ని ఈ నెల 10 వరకు పొడిగించింది.
హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో సోమవారం ఎండీ సజ్జనార్‌కు బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) సంతోష్‌కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు టీఎస్ఆర్టీసీ సీపీఎం కృష్ణకాంత్ తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఎండీ మాట్లాడుతూ.. నిరుడు 88 వేల మంది బుక్ చేసుకుంటే.. ఈసారి సోమవారం నాటికి రికార్డు స్థాయిలో లక్ష మందికిపైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, పీవీ మునిశేఖర్, సీటీఎం జీవన్‌ప్రసాద్ పాల్గొన్నారు.