అశ్వారావుపేట/ములకలపల్లి, జూన్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మంత్రులకు నిరసన సెగ తగిలింది. మంత్రులు వస్తున్నట్టు తెలుసుకున్న సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణాల్లో సాగు భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు.
గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ములకలపల్లి మండలం ఒడ్డురామవరం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు.
ప్రాజెక్టు కాలువ, పంపుహౌస్ నిర్మాణాల్లో భూములు కోల్పోయిన ఆ గ్రామానికి చెందిన నిర్వాసితులు అక్కడికి చేరుకొని మంత్రులను అడ్డుకోబోయారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోడు భూముల గిరిజనులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు కాలువల కోసం తీసుకున్న తమ భూములకు పరిహారం ఇవ్వాలని, 25 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలిపించుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో సాగు భూములు కోల్పోయిన తమకు పరిహారం అందలేదని వివరించారు. పోడు చేసుకుంటున్న తమను అటవీ అధికారులు కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నట్టు చెప్పారు. తక్షణమే పరిహారం మంజూరు చేయాలని, పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలని, కేసులు ఎత్తివేయాలని విజ్ఙప్తి చేశారు. లిఖిత పూర్వకంగా వినతిపత్రం ఇస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన నిర్వాసితులు, పోడు గిరిజనులు మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు.