అమ్రాబాద్, మే 22 : అమాయక చెంచులను కొందరు కాంగ్రెస్ నేతలు, చెంచు నాయకులు మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆదివాసీ చెంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న నల్లమలలోని మాచారంలో జరిగిన సభలో సీఎం రేవంత్ 27 మంది చెంచు కుటుంబాలకు పోడు భూముల పట్టాలు అందించినట్టు గొప్పలు చెబుతూ.. బీఆర్ఎస్ హయాంలో చెంచులను ఆదుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. మాచారంలో అలివేలమ్మకు పోడుభూమి రాలేదని కుటుంబంతోపాటు ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు.
ఈ విషయం చెంచు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దృష్టికి తీసుకెళ్తే.. ఆయన కలెక్టర్, ఐటీడీఏ పీవోతో మాట్లాడి ఆమెకు భూమి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో.. 483 మంది చెంచు కుటుంబాలకు పోడుభూముల పట్టాలు వచ్చినట్టు వెల్లడించారు. మన్ననూర్‌లో గిరిజన భవనం, 300 మంది చెంచు పోడు భూముల్లో బోర్లు వేయించడంతోపాటు మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి సీసీడీపీ కింద చేయూతనందించినట్టు చెప్పారు. హెల్త్ న్యూట్రిషన్ ద్వారా చెంచుపెంటలలో పౌష్టికాహారం అందించారని తెలిపారు. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో 18 నెలల్లో చేసిందేమీ లేదని విమర్శించారు.