ప్రమాద బాధితులు సకాలంలో దవాఖానకు
21 మందికి ఉత్తమ పౌరుల గుర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రమాదబాధితులకు సకాలంలో సాయం అందించి దవాఖానలకు తరలించి ప్రాణాలు నిలబెట్టిన 21 మందిని పోలీసు విభాగం ఉత్తమపౌరులుగా (గుడ్ సమారిటన్లుగా) గుర్తించి సత్కరించబోతున్నది. వారు కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో స్పందించడంతో దాదాపు 21 మంది పునర్జీవనం పొందారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో క్షతగాత్రులను గుర్తించి వారికి సేవలు చేసిన పౌరులను సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. దీంట్లో భాగంగానే గత రెండు నెలల్లో దాదాపు 21 మందిని గుడ్ సమారిటన్స్ అవార్డుకు ఎంపిక చేయడంతో పాటు నగదు బహుమతి నిమిత్తం కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులకు నివేదిక పంపారు.
సాధారణంగా సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాద సమాచారం అందగానే 5-10 నిమిషాల్లో పోలీసులు, 108 ఘటనాస్థలికి చేరుకుంటాయి. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడినవారు కనపడితే వెంటనే దవాఖానకు తరలించే ఏర్పాట్లు చేయాలని, ఇలా చేసినవారిని ఉత్తమ పౌరులుగా గుర్తించడంతో పాటు వారిని సాక్షి సంతకాలు చేయమని కూడా అడగబోమని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.