
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ఇతర రాష్ర్టాలకన్నా ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన ఇండో-ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి పరిశ్రమలను, పెట్టుబడులను తెచ్చేందుకు అనేక విప్లవాత్మకమైన విధానాలను ప్రవేశపెట్టామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లో అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విధానం విజయవంతమై ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా టీఎస్ ఐపాస్ వంటి విధానం లేదని తాము గర్వంగా చెప్పగలమన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అనేక ఆదర్శవంతమైన కార్యక్రమాలను, పాలనా సంసరణలను చేపట్టినట్లు తెలిపారు. దేశాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే చూస్తే సరిపోదని, తెలంగాణ లాంటి రాష్ట్రాలను స్థానిక ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి అవకాశాల కోణంలో చూడాలన్నారు.
హైదరాబాద్ నగరం.. దేశంలోని ఏ రాష్ట్రం వారికైనా, ప్రపంచంలోని ఏ దేశస్తులకైనా నివసించేందుకు అత్యంత అనుకూలమైన నగరమని కేటీఆర్ అన్నారు. మౌలిక వసతులతోపాటు విభిన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకు ఈ నగరం ప్రత్యేకమని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న అనేక రంగాల ఎకోసిస్టంను ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలతోపాటు ఐటీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నదని వివరించారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరుగాంచిందని గుర్తుచేశారు. గ్లోబల్ ఐటీ కంపెనీలు భారతీయ కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాయన్నారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు నగరంలో ఉన్నాయని వివరించారు.
ఫ్రెంచ్ కంపెనీలు క్యూ
తెలంగాణలో ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర విధానాలు, ఇకడి స్నేహపూర్వక వ్యాపార వాతావరణంపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. మధ్యతరహా కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాలుగా సహకరిస్తామని, పొరుగు దేశాలు, ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
అవకాశాలు పుష్కలం – ఫ్రెంచ్ రాయబారి లెనైన్
ఈ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్తో తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను ఫ్రెంచ్ కంపెనీలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుందని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయెల్ లెనైన్ అన్నారు. తెలంగాణలో ఇన్నోవేషన్‌తోపాటు ఇతర రంగాల్లో అనేక అవకాశాలున్నాయన్నారు. ఈ సమావేశానికి ముందు ఫ్రెంచ్ లైనెన్తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఫ్రెంచ్ వ్యాపార వర్గాలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతలు, ప్రభుత్వ విధానాల గురించి వివరించారు.