హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కులవృత్తులపై ఆధారపడ్డవారికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు అమలు చేశారు. నాటి అభివృద్ధి ఫలాలు నేటికీ అందుతున్నాయి. రాష్ర్టాన్ని దేశంలోనే ఉత్తమంగా నిలుపుతున్నాయి. తాజాగా మంచినీటి చేపల పెంపకంలో దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బెస్ట్ ఇన్‌ల్యాండ్ ఫిష్ స్టేట్ అవార్డును ప్రకటించింది. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం వల్ల నీలి విప్లవం వెల్లివిరిసింది. అద్భుతమైన రీతిలో మత్స్య సంపద పెరిగింది. మత్స్యకారవర్గం సాధికారికంగా ఎదిగింది. మత్స్య ఉత్పత్తిలో మైనస్‌లో ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 69శాతం వృద్ధిరేటుకు చేర్చింది.
చేపల ఉత్పత్తి… సంపద వృద్ధి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకముందు చేపల కొరత ఉండేది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మత్స్య సంపద పెంచి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నాటి సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 2016లో ప్రారంభించిన ఈ పథకం రాష్ట్రంలో మత్స్య సంపదను భారీగా పెంచింది. పథకం కింద ఏటా రూ.100 కోట్ల ఖర్చుతో సుమారు 120 కోట్ల చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. ఈ విధంగా చేప పిల్లల ఉచిత పంపిణీకి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.600 కోట్ల వరకు ఖర్చు చేసింది. తద్వారా 2016-17లో ఏడాదికి 1.93 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. ప్రస్తుతం 4.39 లక్షల టన్నులకు పెరిగింది. చేపల ఉత్పత్తిలో తెలంగాణ 69శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. చేపల ఉత్పత్తితో పాటు మత్స్యకారుల సంపద కూడా పెరిగింది. చేపల ఉత్పత్తి ద్వారా రూ. 36వేల కోట్లకు పైగా సంపద సృష్టి జరిగింది. తద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో నిర్వీర్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాటు చేప పిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేప పిల్లల పంపిణీ పథకాన్ని సర్కారు నిర్వీర్యం చేసింది. పథకాన్ని పూర్తిగా అటకెక్కించేందుకు ప్రయత్నించింది. కానీ మత్స్యకారులు గట్టిగా నిలదీయడంతో తూతూమంత్రంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ సీజన్లో 80 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయగా ఈ సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 40 కోట్ల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. దీంతో ఉత్పత్తి తగ్గి, వృద్ధిరేటు పడిపోయింది.
దాచేస్తే దాగని సత్యం-చెరిపేస్తే చెరగని చరిత్ర
తెలంగాణలో కేసీఆర్ సాధించిన నీలి విప్లవం దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చెరగని చరిత్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. 2016-17లో 1.93లక్షల టన్నుల చేపల పెంపకం నుంచి 2023-24కు 4.39లక్షల టన్నులకు ఎగబాకడమే సాక్ష్యమని తెలిపారు. రాష్ట్రం చేపల పెంపకంలో ఉత్తమ ఇన్‌ల్యాండ్ స్టేట్‌గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమని పేర్కొన్నారు.