‘ఉక్రెయిన్’ విద్యార్థులను చదివిస్తామన్న ఆ రాష్ట్ర సీఎం మమత
స్థానిక కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం ఎన్ఎంసీని కోరుతానని వెల్లడి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొంటున్న ఇతర రాష్ర్టాలు
హైదరాబాద్, మార్చి 16 : ఒకనాడు దేశానికి దారిచూపిన బెంగాల్‌కు ఇప్పుడు తెలంగాణ దారి దీపమైంది. నేడు తెలంగాణ ఆలోచించేది రేపటి దేశ ఆచరణ అవుతుందన్న కొత్త నానుడి మరోసారి నిజమైంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతూ యుద్ధం కారణంగా ఇబ్బందుల్లో పడ్డ తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలోనే కోర్సు పూర్తిచేసేలా సాయం చేస్తామన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటనను బెంగాల్ ఆదర్శంగా తీసుకొన్నది. తాజాగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన ఆ రాష్ట్ర విద్యార్థులకు స్థానిక మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. ఉక్రెయిన్ మెడికల్ కాలేజీల్లో 2-6వ సంవత్సరం (ఉక్రెయిన్‌లో మెడికల్ కోర్సు 6 ఏండ్లు) విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా బెంగాల్‌లోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించాలని కోరుతూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు లేఖ రాస్తానని తెలిపారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న వేలమంది భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా చదువులు మధ్యలో వదిలేసి వచ్చారు. వారిలో తెలంగాణవారు 700 మంది వరకు ఉన్నారు. వాళ్లందరూ ఇక్కడే చదువు పూర్తిచేసేలా ప్రభుత్వమే ఫీజులు కడుతుందని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే తీరులో మమతా బెనర్జీ కూడా ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన దాదాపు 400 మంది బెంగాల్ విద్యార్థులకు సగం ఫీజు చెల్లించి చదివిస్తామని బుధవారం తెలిపారు.
త్వరలో కేంద్రానికి తెలంగాణ లేఖ
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులు కోర్సు పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 744 మంది తెలంగాణ విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పీజీ చేస్తున్నవారు ఎంతమంది? యూజీ వాళ్లు ఎంతమంది? మెడిసిన్ ఎందరు చేస్తున్నారు? ఇతర ప్రత్యేక కోర్సులు చేస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? అనే వివరాలు సేకరిస్తున్నారు. మెడికల్ విద్యార్థులకు అడ్మిషన్ల విషయమై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంతోపాటు మరికొన్ని ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులతోనూ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువు కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దేశంలో వైద్య విద్య సీట్ల కేటాయింపు కేంద్రం ఆధీనంలోనే ఉన్నది. దీంతో అడ్మిషన్ల విషయమై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనున్నది.
మొదటి నుంచీ విద్యార్థులకు అండ
యుద్ధ బాధిత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడంలోనూ రాష్ట్ర ప్రభు త్వం మొదటి నుంచీ ప్రత్యేక చొరవ చూపింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లోని అంతర్గత భద్రత అధికారుల సాయం తో వ్యూహాత్మక కమ్యూనికేషన్ పద్ధతిలో విద్యార్థులను గుర్తిస్తూ విదేశాంగశాఖకు చేరవేసింది. ఇతర రాష్ర్టా ల విద్యార్థులకు కూడా చేయూతనందించి స్వదేశానికి రావడానికి సహకారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మా బిడ్డ సదువుకు సాయంజేత్తే రుణపడి ఉంటం
చేతుల పైసలు లేకపోయినా అప్పుదెచ్చి బిడ్డను ఉక్రెయిన్‌లో డాక్టర్ సదివిచ్చినం. సదువు పూర్తయి తన కాళ్లమీద తాను నిలవడే టైముల యుద్ధం జేయవట్టి గిట్లయిపాయే. ఈ ఏడాదైపోతె సదువైపోయి బిడ్డ మంచిగ బతికేది. ఆ దేశంల సదువు ఆగిపోయినోళ్లకు సదువు పూర్తి జేసెతందుకు సీఎం కేసీఆర్ సారు సాయమందిత్తనని ముందుకచ్చిండ్రు. మా బిడ్డను ఆదుకొని సాయంజేత్తే కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– కడారి రాజయ్య, ఎల్లమ్మ, సుమాంజలి తల్లితండ్రులు (రామంచంద్రాపూర్, కరీంనగర్ జిల్లా)
సీఎం ప్రకటన సంతోషాన్నిచ్చింది
ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు 10 సెమిస్టర్ల ఫీజు చెల్లించాం. ఇంకా ఒక్క సెమిస్టర్ మాత్రమే మిగిలి ఉన్నది. చదువు మధ్యలో వదిలేసి రావడంతో భవిష్యత్తు ఏమిటో అర్థంకాక ఆందోళనలో ఉన్న మాకు సీఎం కేసీఆర్ ప్రకటన సంతోషం కలిగించింది.
– అన్వేష్, వైద్య విద్యార్థి, కామారెడ్డి
మా జీవితాలకు భరోసా
సీఎం కేసీఆర్ నిర్ణయం వైద్య విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పించింది. మెడికల్ విద్యార్థిగా నా చదువుపై నాకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి విద్యార్థులకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు.
–సీహెచ్ పూజ తపస్వి, ఎంబీబీఎస్, ఖమ్మం
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం
యుద్ధంతో చదువులు మధ్యలోనే ఆగిపోయి మా జీవితం వృథాగా మారుతుందని భావించాం. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ సార్ పైసా ఖర్చు లేకుండా మమ్మల్ని తీసుకొచ్చారు. మా లాంటి ఎంతో మంది మెడిసిన్ విద్యార్థుల చదువులు నిలిచిపోకుండా ఉచితంగా విద్యను అందించి ఆదుకుంటామని ప్రకటించారు. దీంతో చాలా ఆనందంగా ఉన్నది.
–రచన, వనపర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం హర్షణీయం
సీఎం కేసీఆర్ ప్రకటన చాలా సంతోషం కలిగించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తామనడం అభినందనీయం. తెలంగాణ నుంచి ఉక్రెయిన్‌లో చదువుతూ మధ్యలోనే వచ్చిన వారందరినీ కేసీఆర్ ఇక్కడే ఉచితంగా చదివిస్తామనడం గొప్ప విషయం. ఇలా చేస్తే సీఎం కేసీఆర్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దేవుడిలా పూజిస్తారు.
– ప్రియాన్స్, ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థి, గోకుల్‌నగర్, హనుమకొండ