కాశీబుగ్గ, మే 4: ప్రభుత్వంలోని ఓ చిరుద్యోగి. సుదీర్ఘకాలం విధులు నిర్వహించాడు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని అనుకున్నాడు. కానీ ఏండ్లు చేసిన కష్టానికి హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఆవేదన చెందాడు. చివరికి మృత్యు ఒడిలోకి చేరిపోయాడు. వివరాల్లోకి వెళ్తే హనుమకొండకు చెందిన బాలగోని లక్ష్మణ్‌కుమార్ పైడిపల్లిలోని జడ్పీహెచ్ఎస్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అతడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురుకు పెళ్లిచేశాడు. కుమారుడు మానసిక దివ్యాంగుడు. లక్ష్మణ్‌కుమార్ అప్పుల్లో ఉన్నాడు. రిటైరైతే బెనిఫిట్స్ వస్తాయని, అందరి అప్పులు తీర్చేస్తానని భావించాడు. 2025 ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ పొందాడు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 30లక్షలు బెనిఫి ట్స్ రాగానే అప్పులన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ బెనిఫిట్స్ త్వరగా వ చ్చే పరిస్థితి లేదని తెలిసి మనస్తాపానికి గురయ్యాడు. తీవ్రమైన ఒత్తిడి గురైన లక్ష్మణ్‌కుమార్ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. బెనిఫిట్స్ ఆలస్యమవుతున్నాయన్న అధికారుల సమాధానాలు చూసి ఆందోళన చెందాడు. మార్చి 16న బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యాడు. 48రోజుల పాటు మృత్యువుతో పోరాడి, శనివారం కన్నుమూశాడు. చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వ హెల్త్‌కార్డ్ కూడా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులు మరో రూ.10 లక్షలు అప్పుచేశారు. ప్రభు త్వ నిర్లక్ష్యం కారణంగానే లక్ష్మణ్‌కుమార్ మృత్యువాతపడ్డాడని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ప్రతినిధులు వీరయ్య, రామమనోహర్ మండిపడ్డారు.