నారాయణపేట, డిసెంబర్ 31 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆసరా పింఛన్ల మొత్తం పెరగకపోవడంతో నారాయణపేట జిల్లా మరికల్లో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పెంచిన పింఛన్‌ను ఎప్పుడు ఇస్తారంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2,016 ఆసరా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, రూ.3,016 దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు గుర్తుచేస్తూ మంగళవారం ప్లకార్డులు పట్టుకొని పోస్టాఫీసు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అనంతరం సీఎంకు రాసిన ఉత్తరాన్ని సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. మరికల్ పంచాయతీలో మొత్తం 1,341 మంది పెన్షన్‌దారులు ప్రతినెలా ఆసరా పెన్షన్లు అందుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పింఛన్లు పెంచుతామని మాట ఇవ్వడమే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడంతో నమ్మి తామంతా కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్టు చెప్పారు. ఏడాది అవుతున్నా పింఛన్లు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. పెంచి ఇస్తామన్న పింఛన్ మొత్తం కలిపి ఏడాది కాలానికి రూ.24 వేల బకాయిలను సైతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.