హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘అరవై రోజుల్లో ఇస్తామన్న క్యాబినెట్ సబ్‌కమిటీ రిపోర్టు ఆరు నెలలైనా రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నం.46ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు హోరెత్తించారు. మమ్మల్ని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్క్ దగ్గర దీక్షలు కూడా చేపట్టారు. మేమున్నామంటూ కపట ప్రేమను నటించారు. ఎన్నికల్లో మాతో, మా కుటుంబసభ్యులతో ఓట్లు వేయించుకొని.. గెలిచి, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నట్టేట ముంచారు. కాంగ్రెస్ అంటేనే కమిటీలతో కాలయాపన’ అంటూ జీవో 46 బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద ప్రణాళికతో హైకోర్టులో తమ పిటిషన్‌ను కొట్టివేసేలా పావులు కదిపిన నేతలు.. రేపు ఏ ముఖం పెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడుగుతారో చూస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అత్యధిక మార్కులు వచ్చిన తమకు ఉద్యోగం ఇవ్వకుండా జీవోను అడ్డంపెట్టుకొని టీజీఎల్పీఆర్బీ చైర్మన్ తమను నట్టేట ముంచాడని ఆరోపిస్తున్నారు. తమకు హైకోర్టులో న్యాయం జరగకపోవడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
ఎన్నికలకు మందు.. ఆ తర్వాత..
జీఓ నం.46ను రద్దు చేయాలి. టీఎస్ఎస్పీలో కానిస్టేబుల్ పోస్టులకు తెలంగాణ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 2023 జూలై 19న ఇందిరాపార్క్‌లో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షకు పిలుపునిచ్చింది. ఆ దీక్షకు సహకరించిన ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సహా కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని బాధిత అభ్యర్థులు వాపోతున్నారు. జీవో 46పై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసి వారికి న్యాయం చేస్తామని, పాలనాపరంగా, చట్టపరంగా నిపుణుల సూచనలు తీసుకొని జీవోకు సంబంధించిన ఇబ్బందులను అధిగమిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారని అంటున్నారు. క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పడి ఆరు నెలలు గడిచినా.. ఒక్కసారి కూ డా తమ సమస్యలపై చర్చ జరపలేదుని, వివరాలు తీసుకోలేదని.. ఈ కమిటీతో ఇంతవరకూ తమకు న్యాయం జరగలేదని విమర్శిస్తున్నారు.
వరస వాయిదాలు కోరిన ఏజీ..
టీజీఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరా వు ఆడిన ఆటలో నాటి ప్రభుత్వం, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మోసపోయారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రూ.18 లక్షలు ఖర్చుపెట్టి 8 నెలలుగా పోరాడితే.. ప్రభుత్వం తెలివిగా ఆ కేసును కొట్టివేసేలా వాదించాలని ఒత్తిడి తె చ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వరుసగా వాయిదాలు కోరారని వివరించారు. కోర్టు స్టే ఆర్డర్‌ను ధిక్కరించి ఫలితాలు వెల్లడించారని తెలిపారు. దీనిపై మంత్రులకు, డీజీపీకి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు. తాము కోర్టుకు వెళ్లిన తర్వాతే జీవో 40 కాపీని టీజీఎస్పీఆర్బీ వెబ్సైట్లో పెట్టారని చెబుతున్నారు. రిజల్ట్ రాకముందు రూ.50 వేలు పెట్టి కోర్టుకు వెళ్తే.. వారు స్టే ఆర్డర్ ఇ చ్చారని, అయితే.. దాన్ని కూడా ధిక్కరించి రాత్రికి రాత్రే.. ఫలితాలు విడుదల చేశారని మంత్రులు ఇప్పటికైనా ఖాళీగా ఉన్న రెండు వేల పోస్టులను తమతో భర్తీ చేయాలని కో రుతున్నారు. అందుకోసం సూపర్ న్యూమ రీ పోస్టులు క్రియేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమతో ఉద్యమం చేయించిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. న్యాయం చేయకపోతే.. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిపై ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.