హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయనున్న ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని మంత్రి కేటీఆర్ ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్రిప్స్ను కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పిడి, ఉమ్మడి పరిశోధన, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన శాన్‌డియాగోలో స్రిప్స్ పరిపాలక సభ్యులైన డాక్టర్ జేమ్స్ విలియమ్సన్, (ఈవీపీ రిసెర్చ్ అండ్ అకడమిక్ అఫైర్స్), మేరీవాంగ్ (స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్), డాక్టర్ అర్నబ్ ఛటర్జీ (వీపీ, మెడిసినల్ కెమిస్ట్రీ, కాలిబర్-స్రిప్స్ రిసెర్చ్), ప్రొఫెసర్ సుమిత్ చందాతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ వివరాలతోపాటు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న అపార అవకాశాలను వారికి వివరించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం, ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాల గురించి తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటు, భారత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏ రాష్ట్రంలో లేనన్ని అనుకూలతలు తెలంగాణకు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఈ ప్రజెంటేషన్‌పై స్రిప్స్ బృందం ఎంతో ఆసక్తి కనబర్చింది. తమ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న భాగస్వామ్యంపై చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొంటామని మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చింది. ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో దూసుకుపోతున్న స్రిప్స్ విజయగాథను అధ్యయనం చేసేందుకు వరింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు.
ఇదీ స్క్రిప్స్ నేపథ్యం
సైన్స్ పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థగా పేరు గడించిన స్రిప్స్ రిసెర్చ్‌కు 200కుపైగా ప్రయోగశాలలతోపాటు 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, లాభాపేక్షలేని ప్రైవేట్ బయోమెడికల్ పరిశోధన సంస్థగా పేరున్నది. ఈ సంస్థలో పరిశోధనలు చేసిన ఐదుగురుకి నోబెల్ పురస్కారాలు దక్కాయి. స్రిప్స్కు దాదాపు 1,100 పేటెంట్లు ఉన్నాయి. ఎఫ్‌డీఏ ఆమోదిత 10 చికిత్సా విధానాలను ఆవిష్కరించటంతోపాటు 50కిపైగా స్పిన్-ఆఫ్ కంపెనీలను స్రిప్స్ ఏర్పాటు చేయటం విశేషం.