హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి, హోం మంత్రిగా కూడా ఉన్న ఆయనకు దర్యాప్తు అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను నివేదించవద్దని స్పష్టంచేసింది.
ఓటుకు నోటు కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వైద్యనాథన్‌తో కూడిన ధర్మాసనం వాదనలు ఆలకించింది. అనంతరం కేసును భోపాల్‌కు బదిలీ చేయాల్సిన అవసరంలేదని పేర్కొన్నది. అలాగే, ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు తదుపరి ట్రయల్‌ను కూడా కొనసాగిస్తారని తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరుపాలన్న పిటిషనర్ విజ్ఙప్తిని తోసిపుచ్చింది. అయితే, ఈ కేసులో కీలకంగా ఉండి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసుకు సంబంధించిన పురోగతి, నివేదికలను ఇవ్వరాదని ఆదేశించింది. హోం మంత్రిగా కూడా ఆయనే ఉన్నందున రేవంత్‌కు ఏసీబీ రిపోర్ట్ చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ డీజీపీ సీఎం/హోంమంత్రికి రిపోర్టు చేయవద్దని, ఒకవేళ చేసినట్టు పిటిషనర్ వద్ద ఆధారాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
నోరు జాగ్రత్త..
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో న్యాయవాదులు, న్యాయమూర్తుల పట్ల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరిన క్షమాపణలను సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ కోర్టు తీర్పుల పట్ల విమర్శనాత్మకమైన అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రస్తుత దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని అంటూ విచారణను సుప్రీంకోర్టు ముగించింది. శాసన, న్యాయ, పరిపాలనా వ్యవస్థలు తమ విధులను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.