హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాధారణకంటే ఎకువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వరదలు, వానలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నష్టం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీలైనంత మేరకు ప్రాణ, ఆస్తి, ఆర్థికనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆరోగ్యశాఖ కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కమిటీ వారంరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.