హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు విరిగిపడడం, విద్యుత్తు స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించి సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఏ రిజ్వీ, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.