Kakatiya University | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11 : నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. మూడేండ్లు కష్టపడి చదివి సంతోషంగా సర్టిఫికెట్స్ తీసుకునే సమయంలో చదివింది ఒక్కటైతే సర్టిఫికెట్లో మరొకటి రావడంతో అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో 100కు 105 మార్కులు కూడా వేసిన ఘనత కాకతీయ విశ్వవిద్యాలయానికే దక్కింది. విద్యార్థులు పరీక్షకు హాజరై రాసినా కూడా గైర్హాజరైనట్లు ఫెయిల్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఇటీవల ఆన్సర్ బుక్లెట్లు మార్చిన ఘటన కేయూలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పరీక్షల విభాగంలో జరిగిన తాజా పరిణామాలు చూస్తే విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
వర్సిటీ పరీక్ష విభాగం తప్పిదం వల్ల బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసిన విద్యార్థులకు బీకాం సర్టిఫికెట్ రావడంతో అయోమయానికి గురయ్యారు. 80 మంది విద్యార్థులకు బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఉండాల్సిన సర్టిఫికెట్లలో బీకాం పూర్తి చేసినట్టు ఇచ్చారు. ఇదేంటని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతిని నిలదీశారు.
సర్టిఫికెట్స్ ముద్రించే క్రమంలో ఎక్కడో తప్పిదం జరిగింది. బీకాం కంప్యూటర్స్‌కు బదులు సర్టిఫికెట్లో బీకాం అని వచ్చినట్టు తెలిసింది. ఈ విషయమై సిబ్బందిని మందలించాం. మళ్లీ కొత్త సర్టిఫికెట్స్ ప్రింట్ తీసి కాలేజీకి పంపిస్తున్నాం.