హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శాఖ అందిస్తున్న శిక్షణను ఉపయోగించుకొని బీసీ యువత సొంతంగా ఎదగాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. సాప్ట్వేర్ ఇంజినీరింగ్, సాప్, అకౌంటెన్సీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో బీసీ యువతకు శిక్షణను అందించేందుకు బీసీ సంక్షేమశాఖ మంగళవారం ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యుత్తమ ప్రపంచ స్థాయి శిక్షణను పూర్తి ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. బ్యాచ్‌కు మూడు నెలల పాటు అందించే శిక్షణను 8వ తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన బీసీ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాల యంతో పాటు కార్పొరేషన్ కార్యాలయాల్లో ఉచిత శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నాణ్యమైన శిక్షణ అందజేస్తున్నామన్నారు.