హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సుమారు రూ.5వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని, ఆ నిధులను ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పించాలని, బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ర్యాంకుతో నిబంధన లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలని కోరారు.