హనుమకొండ, నవంబర్ 18: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుచేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వ్యహరిస్తున్న తీరుపై న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ముందే చెప్పినా వినిపించుకోలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామనడం దుర్మార్గమని చెప్పారు. క్యాబినెట్లో పార్టీపరంగా 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని నిర్ణయించినపుడు బీసీ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం ప్రధాని, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇతర నేతలు, సంఘాలను కలుపుకొని పోరాడుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేసేవి వారోత్సవాలు కావు.. తెలంగాణ ప్రజల పీడోత్సవాలని విమర్శించారు. మాజీ ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ట్ నాయకులు బీసీలను నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాంగపరంగా 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు కలిసికట్టుగా పోరాడుదామని జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు పేర్కొన్నారు.