హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25న నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహించాలి? ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై విస్తృతంగా సమాలోచనలు చేయనున్నట్టు సమాచారం. ఇటీవలి క్యాబినెట్ సమావేశాల్లోనూ స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. వచ్చే క్యాబినెట్ భేటీలోనూ ఇవే అంశాలు కీలక చర్చనీయాంశాలు కానున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్ ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. బీసీ బిల్లులు కేంద్రానికి పంపించి 150 రోజులు దాటినందున దానిని జాతీయ స్థాయి అంశంగా మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లుపై ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేసింది. కేంద్రం, రాష్ట్రపతి ఈ బిల్లులను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. హైకోర్టు వివరణ కోరిన నేపథ్యంలో ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించాలా? వద్దా? అనే విషయంపై క్యాబినెట్లో సమాలోచనలు జరుపనున్నట్టు తెలిసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన రిపోర్టుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ చేసి, సమగ్రంగా చర్చించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది.
బీసీ రిజర్వేషన్ బిల్లును మూడు నెలల క్రితమే కేంద్రానికి పంపించామని, ఇదే అంశంపై ఆర్డినెన్స్ కూడా తెచ్చి గవర్నర్‌కు పంపించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు తమ పరిధిలో లేదని, కేంద్రం కోర్టులో ఉన్నదని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై నెపం నెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కారు చూస్తున్నట్టు తెలుస్తున్నది. బీసీ రిజర్వేషన్ల పరంగా అన్ని చేశాం.. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అడ్డుకుంటున్నదని చెప్పి, బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఒకవేళ బీసీల నుంచి ఒత్తిడి వస్తే, పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు ఇస్తామని చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ అధికారులతో పంచాయతీరాజ్ అధికారులు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధంచేసిన ఎన్నికల సంఘం అధికారులు, తాజాగా ఓటర్లు జాబితాను కూడా కొత్తగా రూపొందించినట్టు సమాచారం.