ముషీరాబాద్, అక్టోబర్ 19: బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామంటూనే అదే బీసీ ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ కేసులు ఎలా పెడుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. సర్కారు అక్రమ కేసులకు భయపడేది లేదని, రిజర్వేషన్లు సాధించి తీరుతామని, మిలియన్ మార్చ్ నిర్వహించి హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీసీ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే అగ్రవర్ణాలకు ఎందుకు కడుపుమంట? అని ప్రశ్నించారు. బంద్ ప్రభావంతో బీసీల హక్కులు ఇవ్వడానికి ప్రధాని మోదీ సైతం ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలో బీసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీ రాజేందర్, రామ్‌కోటి, రవి, నిఖిల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.