హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : కులగణన చేపట్టాలి, లేదంటే గద్దె దిగిపోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణనతోపాటు బీసీల డిమాండ్ల సాధనకు ఢిల్లీలో శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రధాని మోదీ బీసీ బిడ్డగా ఆలోచించి బీసీ కులగణన చేపట్టి బీసీల మన్ననలు పొందాలని కోరారు. వర్గీకరణ తరహాలోనే కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా మరో మహా మండల్ ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్‌ను బీసీలు ఎప్పటికీ నమ్మబోరని తెలిపారు. మహాధర్నాలో ఎంపీ మల్లు రవి, వివిధ రాష్ర్టాల బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.