ఖైరతాబాద్, మే 18: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారని, బీసీ రిజర్వేషన్లు కేటాయించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు, నిరసన ర్యాలీలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
25న తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వినతిపత్రాలు అందజేస్తామని, జూన్ 8న ఇందిరాపార్కు వద్ద బీసీల మహాధర్నా చేపడుతామని వివరించారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి రాకుంటే 15న రాష్ట్రవ్యాప్తంగా చలో హైదరాబాద్ పిలుపునిచ్చి సెక్రటేరియేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీఎస్‌ఈడబ్ల్యూడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, మున్నూరుకాపు సంఘం నాయకులు సర్దార్ పుటం పురుషోత్తంపటేల్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, ఓయూ విద్యార్ధి సంఘం నాయకులు లింగం శాలివాహన, యాదవ సంక్షేమ సంఘం నాయకులు మధుయాదవ్, మల్లేశ్‌యాదవ్, హరికృష్ణ, రాజు, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.