తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 20 : కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల చేసిన జనగణన గెజిట్‌లో బీసీ కులాల ప్రస్తావన లేకపోవడం దారుణమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బీసీలపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 24న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. గురువారం సైఫాబాద్‌లోని బీసీ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన బూటకమని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై కేంద్ర వైఖరి విషయంలో జెన్‌జీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో బీసీ కులాల వారీగా గణన చేపట్టాలని, జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నవంబర్ 20 నుంచి జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర్ ఉన్నారు.