కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి కమాన్‌చౌరస్తా వరకు రన్‌ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట న్యాయసాధన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు ఆది మల్లేశం, నాగుల కనకయ్యగౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలని హితవు పలికారు. క్యాబినెట్ సమావేశంలో రిజర్వేషన్లు అమలు గురించి ప్రకటించాలని కోరారు. డిసెంబర్లో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.