హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో7 ప్రతులను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేసి నిరసన తెలుపాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దుకు కుట్ర చేస్తున్నదని జాజుల నిప్పులు చెరిగారు. విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పునకు ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఉన్నత విద్యకు బడుగు విద్యార్థులను ప్రభుత్వం దూరం చేస్తున్నదని, అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ సీమ్‌ను నీరుగార్చేందుకే జీవో 7ను తీసుకొచ్చిందని విమర్శించారు. అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల సీమ్‌ను తీసుకొస్తే, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేటి కాంగ్రెస్ ఆ సీమ్‌ను రద్దు చేయాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. పథకంపై ప్రభుత్వం డొంకతిరుగుడు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించకుంటే జూన్‌లో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.