హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తేతెలంగాణ): బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీసీ హకుల సాధన సమితి రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. జనగణనలో భాగంగా ఓబీసీ కులగణన జరపాలని, చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో బుధవారం సమితి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయనాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీల డిమాండ్లను ఆమోదింపజేయాలని కోరారు. లేనిపక్షంలో బీజేపీ రా ష్ట్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వరరావు, నేదునూరి రాజమౌళి, లొడంగి శ్రవణ్‌కుమార్, బొడ్డుపల్లి కృష్ణ, యేశాల అశోక్, సీహెచ్ దశరథ్, పెరుగు కుమార్, చింతకింది కుమారస్వామి, విజయుడు పాల్గొన్నారు.