BC Financial Aid | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కులవృత్తులు, చేతివృత్తి పనుల చేసుకునే బీసీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలోనే పథకానికి రూ.400కోట్ల నిధులను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ నిధులను పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అందించనున్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తోన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కులవృత్తులు, చేతివృత్తులకు చేయూతనందించేందుకు ఆర్థిక సాయం ప్రకటించింది. కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ప్రారంభించగా.. పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆర్థిక సాయం కోసం విశ్వ బ్రహ్మణులు, నాయీ బ్రహ్మణులు, రజకులు, కుమ్మరి, మేదరి తదితర కులాలకు చెందిన వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన కులవృత్తులు, చేతివృత్తి పనులు చేసుకుంటున్న వారికి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు కోసం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది.
మరో వైపు కులవృత్తులు, చేతివృత్తులు చేసే బీసీ కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామాలవారీగా అందిన దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి, అర్హులైన వారి జాబితాలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది. కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్ అధికారులు, మండల పంచాయతీ అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు నిర్ణీత నమూనా పత్రాన్ని పంపగా.. కార్యదర్శులు సమాచారం సేకరిస్తున్నారు.