మన్సూరాబాద్, జూలై 13 : ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి వరకు వెళ్లాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్‌పై జక్కిడి శివచరణ్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తున్నది. ఈశ్వరమ్మపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ఉదయం ఎల్బీనగర్, చింతలకుంటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాల నాయకులు, ఈశ్వరమ్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. శివచరణ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేశారు. గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు.
పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు, ఈశ్వరమ్మ మద్దతుదారులు సెంట్రల్‌బ్యాంక్ కాలనీలో ఉన్న శివచరణ్‌రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేసేందుకు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య నేతృత్వంలో తరలివెళ్లారు. అప్పటికే అక్కడ భారీగా పోలీసులున్నా వారని ఛేదించుకుని జక్కిడి ఇంటిపైకి కొందరు కాంగ్రెస్ నాయకులు, ఈశ్వరమ్మ మద్దతుదారులు, బీసీ సంఘాల నేతలు పరుగుపెట్టారు. దీంతో ఉద్రిక్తంగా మారింది. ఈశ్వరమ్మ మద్దతుదారులు మొదట జక్కిడి ఇంటివైపు రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ప్రతిగా శివచరణ్‌రెడ్డి మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. ఏసీపీ కృ ష్ణయ్య, సీఐలు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. జకిడి శివచరణ్‌రెడ్డిని అభ్యంతరకరమని తక్షణమే అతడిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ డిమాండ్ చేశారు.