హైదరాబాద్, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ) : బీసీలు రగిలిపోతున్నారు. కులాల వారీగా బలహీనవర్గాల జనాభాను కావాలనే తక్కువ చూపారంటూ గగ్గోలు పెడుతున్నారు. తక్కువు చూపడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకొన్నదంటూ నిప్పులు చెరుగుతున్నాయి. బీసీల్లో అత్యధికంగా ముస్లిం షేక్లే ఉన్నారంటూ ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. దీంతో సర్కార్ విడుదల చేసిన గణాంకాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్ర భుత్వం గత నవంబర్లో రాష్ట్రంలోని ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల -2024) నిర్వహించింది. ఆ సర్వే గణాంకాల నివేదికను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, ముస్లింలలోని మొత్తం 242 కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడించింది. ఆయా కులాలు, ఉపకులాల వారీగా ఆర్థిక స్థితిగతులు, విద్యా, ఉపాధి, ఉద్యోగశాతం గణాంకాలనూ వివరించింది. ప్రస్తుతం ఆ గణాంకాలపై ఆయా కులాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%, నో క్యాస్ట్ 4% చొప్పున ఉన్నారని వెల్లడించింది. బీసీల మొత్తం జనాభాలో 27, 95,727 మంది బీసీ-ఈ క్యాటగిరీలోని షేక్లే (7.9శాతం) ఉన్నారని నిర్ధారించింది. ఆ తర్వాత ముదిరాజ్ జనాభా అత్యధికంగా ఉన్నదని తెలిపింది. ఆ గణాంకాలపైనే బీసీ కులాలు నిప్పులు చెరుగుతున్నాయి.
రాష్ట్రంలో బీసీలైన పద్మశాలీల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ప్రభుత్వం పద్మశాలీల సంఖ్యను 3.3 శాతంగానే చూపింది. పద్మశాలీల ఉపకులమైన నీలకంఠం ఒకటి. దాని జనాభా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో అత్యల్పంగా ఉంటుంది. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, సదాశివపేట, శంకరంపేటలోనే ఈ కమ్యూనిటీకి సంబంధించిన సత్రాలు, నీలకంఠేశ్వర ఆలయాలు, సహకార సంఘాలు, కల్యాణవేదిక ఉన్నాయి. ఒక్క సిద్దిపేటలోనే వీరి జనాభా 3 నుంచి 4 వేల మంది జనాభా ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా కలిపి 7,700 జనాభా మాత్రమే ఉన్నట్టుగా చూ పింది. దీనిపై నీలకంఠ కులస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. .
బీసీల్లో గౌడ, ఈడిగ, శ్రీశయన, శెట్టిబలిజ ఉపకులాలైన గౌడశెట్టి, ఏనుగుటి పటం కులాల్లోని మొత్తం జనాభా దాదాపు 26 లక్షలకు పైగా ఉన్నారని ఆ కులసంఘాలే వెల్లడిస్తున్నాయి. అలాంటిది ప్రభుత్వం గౌడ కులస్తుల జనాభా 16,30,187 (4.6శాతం) ఉన్నట్టు చూపిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తమ కులాల జనాభాను 7 లక్షల వరకు సర్కార్ తగ్గించి చూపిందని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జాతీయులు భగ్గుమంటున్నారు. కమ్మ రం, వడ్రంగం, ఇత్తడి, శిలాశిల్పి, స్వర్ణకార, పంచదాయ వృత్తిదారులందరినీ కలిపి విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జాతీయులుగా గత ప్రభుత్వాలు, కమిషన్లు గుర్తించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ విస్మరించి, అందుకు విరుద్ధంగా కులగణనలో విభజించి వివరాలు సేకరించింది. మొత్తంగా రాష్ట్రంలో 20 లక్షలకు పైగా తమ కులాలు ఉన్నాయని, కానీ ప్రస్తుతం 13లక్షలకు మించకుండా సర్కార్ లెక్కలు ఉన్నాయని చెప్తున్నారు.
సర్కార్ కులగణన గణాంకాలను బీసీ వర్గాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలోని బీసీల్లో అత్యధిక జనాభా తమదేనని, కానీ, తమ కులస్తులు 26,39,027 (7.4శాతం) ఉన్నట్టు సంఖ్యను తగ్గించి చెప్పారని ముదిరాజ్ (బీసీ-డీ) అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. యాదవ, మున్నూరుకాపు, పద్మశాలి, రజక, కురుమ/కురుబ, వడ్డెర, అగ్నికుల క్షత్రియ తదితర కులాలన్నీ తమ జనాభాను తగ్గించి సర్కార్ చూపిందని ఆగ్రహంతో ఉన్నారు. సర్కార్ లెక్కలపై ఎస్సీలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 20శాతానికి మించి ఉంటుందని, కానీ ప్రభుత్వం తాజాగా 17.43 శాతమే ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన గణాంకాలపై అన్నికులాలు, వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి తెలంగాణ తొలి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వేలో అన్ని కులాల వారీ లెకలు సేకరించారు. ఆ లెకల్లో 30 లక్షల మంది కులం నమోదు చేయని కారణంగా, మరికొన్ని కారణాలతో అప్పటి ప్రభుత్వం ఆ లెకలను ప్రకటించలేదు. కానీ 2014 నుంచి 2025 వరకు ఈ పదేండ్ల కా లంలో బీసీలు 21 లక్షల మంది కనపడకుండాపోయారు. అంతేకాదు బీసీల్లో అసలు జనాభా పుట్టనే లేదన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం చేసిన లెకలు చెప్తున్నాయని విమర్శిస్తున్నారు.